My Writings‎ > ‎

తప్పు ఎవరిది?

posted Mar 18, 2008, 12:22 PM by Pradeep Miriyala   [ updated Sep 8, 2008, 3:12 PM ]
ఆగష్టు పదిహేను 2007
నా ఫోన్ లో ఏదో గేమ్ ఆడుకుంటున్న నాకు, నా వైపే ఎవరో తీక్షణంగా చూస్తున్నట్టు అనిపించింది
చూస్తే స్కూల్ యూనిఫామ్ లో ఒక అబ్బాయి, నాకు సమీపంలో నుంచుని నన్నే గమనిస్తున్నాడు

అది ఏదో షాపింగ్ కాంప్లెక్స్ అయితే నేను పట్టించుకునే వాడిని కాదు, కానీ నేను ఉన్నది నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో (చెన్నై నుంచి నిజాముద్దీన్ వెళ్తోంది, చెన్నై దాటి ఒక గంట అవుతోంది) సమయం చూస్తే ఉదయం పదకొండు గంటలు

ఆ అబ్బాయిని చూడగానే నాకు ఏదో తేడాగా అనిపించింది, ఎందుకంటే ఊరు వెళ్తున్నవాళ్ళెవరూ సాధారణంగా స్కూల్ యూనిఫామ్ లో వెళ్ళరు కదా. చూడబొతే ఒక్కడే వెళ్తున్నట్టు ఉన్నాడు.

పైగా నేను ఇదే ట్రైన్లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు వెళ్ళాలి (నేను ఒక్కడినే చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్నాను).
సరేలే అని పలకరించా. ఆ అబ్బాయి పేరు మహేందర్, పదవ తరగతి చదువుతున్నాడు , హిందీ , ఆంగ్లం మాత్రమే వచ్చు (ఇంకా తమిళ్ నేర్చుకోలేదు)

వాళ్ళ తల్లితండ్రులు ఉండేది పూణెలో ఇప్పుడు ఈ అబ్బాయి చెన్నైలో వాళ్ళ పెదనాన్న ఇంటిలో ఉండి చదువుకుంటున్నాడు గత రెండు నెలలుగా. నెమ్మదిగా తేలిన విషయం ఏమిటంటే వాడు పూణే వెళ్దామని బయలు దేరాడు, తల్లి తండ్రులను చూద్దామని, చేతిలో పైసా లేకుండా! పైగా ఈ ట్రైన్ పూణే వెళ్ళదు. వాడి పరిస్తితి చూస్తే నాకు గజరాజుని రక్షించడానికి పరిగెత్తుకు వచ్చిన విష్ణు మూర్తి గుర్తు రాలేదు, ఆవేశంలో ఏమయినా చేద్దామనుకునే యువ రక్తం కనిపించింది (నేనేమీ ముసలి వాడిని కానులెండి).
తప్పు ఎవరిది? వాడిదా , వాడి తల్లితండ్రులదా ?

నా లాగే వాడి పరిస్తితి గమనించిన మరో సాటి ప్రయాణికుడు వాడికి దారి ఖర్చుల కోసం ఒక వంద రూపాయలు ఇచ్చాడు. ఇంక అప్పటి వరకు బాగానే ఉన్న వాడు కాస్తా అమ్మతో మాట్లాడాలి అన్నాడు, సరేలే అని పూణే ఫోన్ చేసా. ఇంక అప్పుడు మొదలు అయ్యింది అసలు కధ, నా నంబర్ ఇచ్చా వాళ్ళకి, వాళ్ళ అమ్మానాన్న ఏమి చెప్పారో తెలియదు కానీ, వాడు చెన్నై వెనక్కి పోతా అన్నాడు, ఒక పక్క ట్రైన్ ఆగబోతోంది నెల్లూరులో. అప్పుడు వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి మీరు దయ చేసి వాడిని రక్షక భటులకు అప్పగించండి, మేము వచ్చి తీసుకువెళ్తాం అన్నారు.

ట్రైన్ ఆగేది ఎంత సేపు చెప్పండి?
వెంటనే TC దగ్గరకు వెళ్ళి పరిస్తితి చెప్పి సహాయం కోరా,
“నేనేమి చెయ్యగలను, నాకేమి సంభందం, ఇది పోలీస్ ఇష్యూ” అన్నాడు
(మహేందర్ దగ్గర టికెట్ లేదు, కనీసం ఆ వంకతో ఐనా పోలీసులకు అప్పగించవచ్చు)
ఇంక నేను ఆ అబ్బాయిని పోలిసులకు అప్పగించాలనుకున్న ఆలోచన మార్చుకున్నా,
తప్పు ఎవరిది? పైసా కూడా లేని ఈ అబ్బాయితో నాకేమి పని అనుకున్న TCదా, లేక TCని అడిగిన నాదా?

కాసేపటికి ఆ అబ్బాయి తండ్రి మళ్ళీ ఫోన్ చేసాడు, విజయవాడ వరకు నాతో తీసుకువెళ్తా అని చెప్పాను. అసలే నా ఫోన్ సోనీ ఎరిక్సన్ కావడంతో బాటరీ అయిపొవచ్చింది, సరే అని స్విచ్ ఆఫ్ చేసా. ఒక గంట తర్వాత ఆన్ చేసి చూద్దును కదా, మహేందర్ అక్క చెన్నై నుంచి సందేశం పంపింది, మేము బయలు దేరుతున్నాం అని (ఈ గంటలో వాళ్ళ కుటుంబం నుంచి ఒక పది మిస్సుడు కాల్స్ ఉన్నాయి, ఎయిర్ టెల్ వారి సమాచారం ప్రకారం) , సమయం ఒంటి గంట. రైలులో దొరికే తిండి తిని కాసేపు మహేందర్ తో భాతాఖానీలో పడ్డా, గమ్యం ఏమిటి అన్న నా ప్రశ్నకు “ప్రస్తుతానికి ఏమీ లేదు, ఏదో ఒక మంచి ఉద్యోగం చెయ్యాలి” అన్నాడు.
తప్పు ఎవరిది? భవిష్యత్తు మీద సరైన అవగాహన కల్పించని మన చదువులదా, లేక జీవితంలో విజయం అంటే ఉద్యోగమే అనే పరిస్తితి కల్పించిన సంఘానిదా?

సరే, భవిష్యత్తులో ఏమి చదువుతావు అని అడిగా, ప్రతీ పది మందిలో ఎనమండుగురు చెప్పే సమధానమే వచ్చింది, ఇంజినీరింగ్ అని. ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
తప్పు ఎవరిది? ఇంజినీర్సుకు మంచి జీతాలు ఇస్తూ అందరినీ తమ వైపు ఆకర్షిస్తున్న కంపనీలదా లేక రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని మనదా?

ఆ తర్వాత మహేందర్ ఇంటి దగ్గర నుండి ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక కాల్, జాగ్రత్తగా చూసుకోమని, మాట వినకపోతే గొలుసుతో కట్టెయ్యమని. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి, మహేందర్ కు ఒక అక్క (ఫాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి ఉద్యోగం చేస్తోంది) , ఒక తమ్ముడు (UKG చదువుతున్నాడు) ఉన్నారు. దండన కన్నా ఆప్యాయతే త్వరగా జయిస్తుందని ఎప్పటికి అర్ధం చేసుకుంటారో
సమయం మూడు గంటలు,
ఇక్కడ మీకు నేను ముందుగా వేసుకున్న ప్రణాళిక చెప్పాలి, నా ప్రణాళిక ప్రకారం నేను విజయవాడలో నాలుగు గంటలకు ఈ ట్రైన్ దిగి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళే పాసింజర్ ని ఐదు గంటలకు అందుకోవాలి, అక్కడ నుంచి పిఠాపురం వెళ్ళాలి. కాబట్టి నేను ఈ అబ్బాయి కోసం ఆగకపోతే రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరుకుంటా.

ఇంతలో మహేందర్ ఇంటి దగ్గర నుంచి ఫోన్, వాళ్ళ నాన్న ఏడవటం మొదలు పెట్టాడు, నాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు, (వింత ఏమిటి అంటే వాళ్ళ అమ్మ అసలు భాదను బయటపెట్టకుండా నియత్రించుకుంటూ సంతోషంగా మాట్లాడటం)

ఈ అబ్బాయిని విజయవాడ పోలిస్ స్టేషన్ లో వదిలి వేద్దామంటే అది అంత మంచి పనిలా కనిపించలేదు, పోనీ ఆ అబ్బాయిని వాడి మానాన వదిలి వేద్దామా అంటే అది కూడా మంచి పని అనిపించలేదు. ఇంతలో వాళ్ళ పెదనాన్న చెన్నై నుంచి ఫోన్, బయలు దేరాము, దారిలో ఉన్నాము అని. వాళ్ళు ఎంత వేగంగా వచ్చినా 420km రెండు గంటలలో రావడం అసాధ్యం.
విజయవాడలో ఉన్న నా సన్నిహితులకు ఫోన్ చేసా, ఎవరికైనా వీలైతే వాళ్ళకు ఈ అబ్బాయిని అప్పగించి నేను బయలుదేరాలి అని, కానీ ఎవరూ ఆ రోజు విజయవాడలో లేరు.
ఇంక ఒక నిర్ణయం తీసుకున్నాను, మహేందర్ ని వాళ్ళ బందువులకు అప్పగించాకే నేను బయలుదేరాలి అని.

మొత్తానికి ఒక మూడు గంటలు విజయవాడలో వేచిచూసాకా, మహేందర్ బందువులు వచ్చారు. వాళ్ళకు మహేందర్ ని అప్పగించి నేను బస్ లో మా ఇంటికి బయలు దేరాను.

పదకొండు గంటలకు ఇంటికి చేరాల్సిన నేను కొంచెం ఆలస్యంగా, తెల్లవారుఝామున మూడు గంటలకు ఇంటికి చేరాను, ఒక మంచి పని చేసిన త్రుప్తితో నిద్ర పోయా,
మరుసటి రోజు ఉదయం మహేందర్ వాళ్ళ నాన్న ఫోన్ చేసారు, ఏమైనా కారణం చెప్పాడా, ఇలా పారిపోవడానికి అని,
“మిమ్మల్ని మిస్ అవుతున్నాడు “అని చెప్పా, దానికి ఆయన “వాడికి పుణేలొ ఉన్న స్నేహితులు హితులు కారు, అందుకే చెన్నై పంపాను” అన్నారు.
తప్పు ఎవరిది? కొడుకుని ప్రేమతో పాలించలేకపోయిన తండ్రిదా, లేక తన స్నేహితులను సరిగ్గా ఎన్నుకోలేకపోయిన కొడుకుదా?
తప్పు ఎవరిది? ఇంటి మీద బెంగ పెట్టుకున్న కొడుకుదా, లేక కొడుకు బాగా చదువుకోవాలని దూరంగా వుంచి చదివిస్తున్న తల్లిదండ్రులదా?
Comments