My Writings‎ > ‎

తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 1

posted May 30, 2008, 6:56 PM by Pradeep Miriyala   [ updated Sep 8, 2008, 3:11 PM ]

"పనులు చేస్తుంటే పరిచయాలు అవే అవుతాయి" అని మన్మధుడులో త్రివిక్రముడు డైలాగ్ రాసినా ఇలాంటివి వెండితెరపైనే జరిగేది అని కొట్టిపారేసిన నాకు, కళ్ళు తెరిపించింది జర్మనీ ప్రయాణం.

సమయం రాత్రి ఎనిమిది గంటలు, ఇంకో నాలుగు గంటల్లో నా మొదటి విమాన ప్రయాణం.
సమాజాన్ని అభ్యుదయపరిచే పనులు ఏమీ చేయకపోయినా "మెరుగైన సమాజం కోసం" అని డప్పు కొట్టుకునే సదరు TV చానల్ వారు నగరంలో మానవ బాంబులు దిగారంటూ ఒక వార్తను తీసుకొచ్చారు. అలా ఒక గాంగ్ తో గాంగ్ లీడర్ లా బయలు దేరాల్సిన నేను (కనీసం ఎయిర్ పోర్ట్ వరకు) ఒంటరిగానే బయలుదేరాను.

సిన్మాలు చూసిచూసి ఎయిర్ పోర్ట్ అంటే ఒక అధ్బుత ప్రయాణశాలగాను, విమానమంటే సకల సౌకర్యాల వాహనంగా ఊహించుకున్న నాకు బేగంపేట ఎయిర్ పోర్ట్ మరియు సదరు లుఫ్తాన్సావారు కళ్ళు తెరిపించారు.
మా ఊరి రైల్వే స్టేషనే ఎయిర్ పోర్ట్ కన్నా నయమని (సందర్శకుల విషయంలో), మన RTC వారి డొక్కు బస్సుల ప్రయాణమే లుఫ్తాన్సా ఎకానమీ ప్రయాణం కన్నా నయమని తెలుసుకునే సరికే సమయం మించి పోయింది.

పన్నెండు కిలోమీటర్ల ఎత్తులో సైతం స్పీడ్ బ్రేకరులు ఉంటాయని (అదే మేఘాల తాకిడి అన్నమాట), ఎకానమీ విమాన ప్రయాణం అంటే సగటు భారతీయ గ్రామ రహదారిపై స్కూటరుపై వెళ్ళడంతో సమానమనీ తెలుసుకునేసరికి -50C బయటి ఉష్ణోగ్రతలో, తప్పించుకోలేనంత ఎత్తులో నిస్సహాయ స్థితిలోనికి నెట్టబడ్డాను. ఇక చేసేదేమి లేక ఇంకా మిగిలి ఉన్న 8 గంటల ప్రయాణాన్ని తలచుకుని నిద్రకు ఉపక్రమించాను. నిద్ర లేచే సరికి జర్మనీ వస్తుందన్న వెర్రి ఆశతో!!!.

దేవుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్ర పోయే వరం ఇవ్వలేదన్న సంగతి ఒక అరగంటలోనే తెలిసిపోయింది. చేసేది లేక వెర్రి చూపులు చూస్తూ లుఫ్తాన్సా సమర్పించిన "Tararampam" అనే చిత్ర రాజం చూసాను యుద్దఖైదీ లాగ...

నిద్ర రాకపోతే పుస్తకం చదవమన్నారు, ఒక పుస్తకమైనా తెచ్చుకోలేదు అనుకుంటూ, నన్ను నేనే తిట్టుకుంటూ క్షణాలు లెక్కిస్తూ కూర్చున్నా..

నా నిరీక్షణ ఫలించింది, నా మొదటి మజిలీ వచ్చింది. ఒక గంట విరామం తర్వాత మరో విమానం ఎక్కి నా "final destination" ని చేర్చే రెండవ మజిలీకి చేరాను. ఈ సారి కేవలం గంట సేపే ప్రయాణం, హమ్మయ్య అనుకున్నానో లేదో, మా లగేజ్ రాలేదన్న సంగతి తెలిసింది...

ఎంత తిట్టుకున్నా తప్పదు కదా, లుఫ్తాన్సా వారికి ఫిర్యాదు చేస్తే, సాయంత్రానికి మీ అడ్రస్సుకు పంపుతాం అన్నారు. పోనిలే ఈ మాత్రం భరోసా ఇచ్చాడు అనుకుని ముచ్చటగా మూడవ మజిలీ ప్రారంభించాను. ఈసారి ట్రైన్ పై, యూరప్ ట్రైన్స్ అంటే, బుల్లెట్ ట్రైన్స్ అనుకుంటున్న నాకు, తక్కువ దూరాలకు అవి అందుబాటులో ఉండవని తెలిసిన తర్వాత ఒక చిన్న నిట్టూర్పు విడవడం తప్ప చేసేదేమీ లేక గాలి లోపలికి రాలేని ట్రైన్ ఎక్కి మొత్తానికి గమ్యాన్ని చేరాను.

ఒక రోజు విశ్రాంతి తర్వాత మా క్లయింటు వారి కార్యాలయమునకు చేరాము. మేమున్న ఇంటి నుంచి కార్యాలమునకు రెండు కిలోమీటర్లే అయినప్పటికీ, మా రూటులో బస్సులు లేక అప్పుడెప్పుడో కళాశాల రోజుల్లో వదిలేసిన నడకను ప్రారంభించాను. అయితే అయింది కానీ నా మంచికే అని సంతోషించాను.

కార్యాలమునకు చేరిన తర్వాత, మా onsite coordinator పులి ముందు జింక పిల్లను వదిలేసినట్టు, నన్ను మా మానేజరు దగ్గర వదిలేసి జారుకున్నాడు.

కనీసం నీ పేరేమిటి అని కూడా అడగకుంటా, రెండు డబ్బాలు చూపించి మీ గణన యంత్రాలు (అదే computer) సిద్దం చేసుకోండి అన్నాడు. సరేలే ఇంక చేసేదేముంది అని మా డబ్బాలు తెరిచి మొత్తం సిద్దం చేసుకున్నాం. (ఒక రకంగా మన పని మనమే చేసుకోవడం కూడా మంచిదే కదా) . అలా, మొదటి వారమంతా లాబ్ ని సిద్దం చేసుకోవడంతోనో లేక మా పని స్థలాన్ని తయారు చేసుకోవడంతోనో సరిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, ఇండియాలో వదిలేసిన ఒళ్ళు వంచటం అనే మంచి పని తిరిగి మొదలయ్యింది. కళాశాల రోజుల్లో నాలో ఉన్న శారీరక క్రమశిక్షణ తిరిగి వచ్చింది. కానీ చిరాకు మొదలయ్యింది, ఇందుకేనా IT Engineer హోదాలో!!! వచ్చింది అని. రెండు వారాల నిరీక్షణ తర్వాత నేను నా German laptop (సమయాన్ని వ్యర్ధం చేసే మంచి స్నేహితుడు) కొన్న తర్వాత నేను ఎందుకు వచ్చానో ఆ పని మొదలయ్యింది.

ఆఫీసులో ఇలాంటి విచిత్రమైన్ అనుభవాల మద్య, ఇంకో కొత్త అనుభవం వంట చెయ్యడం!!, అసలే శాఖాహారిని కావడంతో బయట తినే సౌకర్యమూ లేకపోయె L . అప్పటి వరకు వంట ఎలా చెయ్యాలో అమ్మ చేసేడప్పుడు చూడడమే అన్న అనుభవంతోనే, వంట గదిలో ప్రవేశించాను. (థియరీ మాత్రమే తెలుసు, ప్రయోగాలు చెయ్యలేదు..ప్రయోగాల పరమార్ధం ఇప్పటికి తెలిసింది, ఎంతైనా ప్రయోగాలు నా మీదే కదా!!). ఎలాగో కష్టాలు పడి మొత్తానికి వంటలు చెయ్యడం మొదలు పెట్టాను.

(మరో పది వారాలు... తరువాతి భాగంలో.. నా German laptop తో కష్టాలు, అధికార కేంద్రాల మద్య నలిగిపోవడం...ఆకర్షణీయమైన నగరం "పారిస్" విశేషాలు..మంచులో నడక..)

Comments